తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు ఆకాశం మొత్తం రంగురంగుల గాలిపటాలతో కళకళలాడుతుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇంటి మేడల మీదకు చేరి గాలిపటాలు ఎగురవేసి సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. ఇది మన సంప్రదాయం. కానీ ఈ సరదా మధ్యలో ఒక తీవ్రమైన ప్రాణాపాయం దాగి ఉంది, అదే చైనీస్ మాంజా వాడకం. తాజాగా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సి పి సజ్జనార్ గారు ఈ విషయంలో హెచ్చరికలు జారీ చేశారు.
ముఖ్యాంశాలు:
- చైనీస్ మాంజా విక్రయాలపై ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక వాట్సాప్ నెంబర్ కేటాయింపు 9490616555.
- నైలాన్ దారాల వల్ల పక్షులు, ద్విచక్ర వాహనదారులకు పొంచి ఉన్న ప్రాణాపాయం.
- పిల్లలకు కేవలం ‘కాటన్ మాంజా’నే కొనివ్వాలని తల్లిదండ్రులకు పోలీసుల విజ్ఞప్తి.
చైనీస్ మాంజా వల్ల ప్రమాదం
సంక్రాంతి అంటేనే పంట పండిన ఆనందం. ఆ సంతోషాన్ని గాలిపటాలు ఎగురవేస్తూ జరుపుకోవడం మన ఆచారం. అయితే గత కొన్నేళ్లుగా మార్కెట్‌లోకి వచ్చిన చైనీస్ మాంజా లేదా నైలాన్ దారం ఈ పండుగ ఆనందాన్ని విషాదంగా మారుస్తోంది. ఈ దారం ప్లాస్టిక్, సింథటిక్ పదార్థాలతో తయారవుతుంది. కొన్ని సందర్భాల్లో గాజు పొడి పూత కూడా ఉంటుంది. దీని వల్ల గాలిలో ఎగిరే పక్షుల రెక్కలు కోసుకుపోవడం, ద్విచక్ర వాహనదారుల మెడకు చుట్టుకుని ప్రాణాలు పోవడం వంటి ఘటనలు మనకు కనిపిస్తున్నాయి.
చైనీస్ మాంజాపై పోలీసుల కఠిన చర్యలు
హైదరాబాద్‌లో చైనీస్ మాంజా విషయంలో పోలీసులు ఇప్పుడు చాలా సీరియస్‌గా ఉన్నారు. నగరంలో ఈ ప్రాణాంతక దారాన్ని విక్రయించే వారిపై ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అమలు చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. అధికారిక ప్రకటన ప్రకారం, చైనీస్ మాంజాను తయారు చేయడం లేదా అమ్మడం చట్టరీత్యా నేరం. ఇప్పటికే నగరవ్యాప్తంగా ఉన్న అన్ని దుకాణాలపై నిఘా ఉంచేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా తప్పదని పోలీసులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. మీ ఏరియాలో లేదా మీకు తెలిసిన షాపుల్లో ఎక్కడైనా ఈ మృత్యుపాశాన్ని విక్రయిస్తున్నట్లు గమనిస్తే వెంటనే అలర్ట్ అవ్వండి. ఆ షాపు లొకేషన్‌తో పాటు ఒక ఫోటో తీసి 9490616555 అనే నెంబర్‌కు వాట్సాప్ చేయండి. మీరు ఇచ్చే ఈ చిన్న సమాచారం ఎంతోమంది ప్రాణాలను కాపాడే అవకాశం ఉంది. మీ వివరాలను పోలీసులు అత్యంత రహస్యంగా ఉంచుతారు.
తల్లిదండ్రులు, పిల్లలు పాటించాల్సిన జాగ్రత్తలు:
పిల్లలకు సంక్రాంతి పండుగ సెలవుల్లో గాలిపటాలు ఎగురవేయడం ఆనందమే అయినా, ఆ సమయంలో తల్లిదండ్రుల అప్రమత్తత చాలా ముఖ్యం. పిల్లలకు గాలిపటాలు కొనిచ్చేటప్పుడు కేవలం నూలు దారాలనే (Cotton Threads) ఎంచుకోవాలి. నైలాన్ లేదా చైనీస్ మాంజా వాడకాన్ని పూర్తిగా దూరం పెట్టాలి. ఇవి పర్యావరణానికి హానికరం కావడమే కాకుండా, చిన్న పొరపాటు ప్రాణాపాయంగా మారే ప్రమాదం ఉంది.
పిల్లలు గాలిపటాలు ఎగురవేస్తున్నప్పుడు విద్యుత్ తీగలకు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు నిరంతరం గమనించాలి. విద్యుత్ తీగల దగ్గర గాలిపటాలు ఎగురవేయడం అత్యంత ప్రమాదకరం. అందుకే పిల్లలను మేడల మీద లేదా టెర్రస్‌లపై ఎప్పుడూ ఒంటరిగా వదలకూడదు. పెద్దల పర్యవేక్షణ తప్పనిసరి.
అలాగే, పిల్లలకు గాలిపటాలు ఎగురవేసే సమయంలో పరుగులు తీయకుండా, అల్లరి చేయకుండా జాగ్రత్తలు చెప్పాలి. రద్దీగా ఉండే రోడ్లకు సమీపంలో గాలిపటాలు ఎగురవేయడం నివారించాలి. తెగిపోయిన దారాలను చేతులతో లాగకుండా, పెద్దల సహాయంతోనే తొలగించాలి.
ఈ సమయంలో రోడ్లపై తిరిగే వాహనదారులు కూడా అప్రమత్తంగా ఉండాలి. ద్విచక్ర వాహనాలపై వెళ్లేటప్పుడు హెల్మెట్ ధరించడంతో పాటు మెడకు స్కార్ఫ్ లేదా మఫ్లర్ కట్టుకుంటే గాలిపటాల దారాల వల్ల గాయాలు అయ్యే ప్రమాదం తగ్గుతుంది. ముఖ్యంగా పిల్లలతో ప్రయాణిస్తున్నప్పుడు వేగం తగ్గించి, జాగ్రత్తగా వెళ్లడం మంచిది.
ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే, గాలిపటాలు ఎగరవేయడం ఆనందంగా సాగడమే కాకుండా, ఎవరి ప్రాణాలూ ప్రమాదంలో పడకుండా సంక్రాంతిని సురక్షితంగా జరుపుకున్నవాళ్ళం అవుతాము
మొత్తానికి తెలుగుప్రేస్స్ చెప్పేది సరదా కోసం మనం వాడే ఒక చిన్న దారం.. మరొకరి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టకూడదు. పర్యావరణాన్ని, పక్షులను కాపాడుకుంటూ సురక్షితంగా సంక్రాంతి జరుపుకోవడమే నిజమైన పండుగ ఆనందం.